Online Puja Services

నాయనార్లగాథలు - గుగ్గులు కలశ నాయనారు

3.17.162.247

నాయనార్లగాథలు - గుగ్గులు కలశ నాయనారు 
లక్ష్మీ రమణ 

ఈశ్వరుడు ఆయన శక్తి ఇద్దరూ ఒక్కరే.  అందుకే ఆయన అర్ధనారీశ్వరుడు.  ఇద్దరుగా దర్శమిచ్చినా , ఆవిడ మహాత్రిపురసుందరి అయితే, ఈయన సుందరేశ్వరుడు .  ఆవిడ కామేశ్వరి అయితే ఈయన కామేశ్వరుడు. ఆవిడ సోమసుందరి అయితే ఈయన సోమేశ్వరుడు .  ఇద్దరూ ఒక్కరే! ఒక్కరే ఇద్దరై , ఆది దంపతులై రచించే జగన్నాటక లీలా విలాసమేగా  ఈ జగత్తు. అయ్యవారు అమృత కలశమునే తన  లింగముగా మార్చి  అమృతఘటేశ్వరునిగా పూజలందుకుంటుంటే, ఆకర్షణే తానైన  అమ్మ అభిరామిగా అయ్యవారి సరసన నిలిచి కొలుపులందుకుంటున్న దివ్య ప్రదేశం తమిళనాడు లోని తిరుక్కడైయ్యూర్ (తిరుక్కడవూర్) .   ఈ అమృత లింగేశ్వరుణ్ణి అర్చించే,  మార్కండేయుడు శివానుగ్రహాన్ని పొందాడు.  ఈ అభిరామి అమ్మ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే భక్తుని కాపాడడం కోసం కాలాన్నే శాశించింది. తన చెవి దిద్దుని విసిరి అమావాస్యని, నిండు పౌర్ణమిగా మార్చేశింది.  అటువంటి అమృతానుగ్రహ ప్రదాయకురాలైన ఆదిదంపతుల అనుగ్రహానికి పాత్రమైనవాడు గుగ్గులు కలశ నాయనారు.  అష్టైశ్వర్య ప్రదాయకమూ , అనంత భక్తిరసాన్వితమూ అయిన ఆ దివ్య ఉదంతాన్ని ఇక్కడ తెలుసుకుందాం. 

గుగ్గిలం, సాంబ్రాణి ధూపం అమ్మకి చాలా ఇష్టం.  అమ్మకి ఇష్టమైనవన్నీ అయ్యవారికి మరింత ప్రీతిదాయకాలే కదా ! గుగ్గులు కలశ నాయనారు  అనునిత్యం  తిరుక్కడైయ్యూర్ లోని అమృతలింగేశ్వరునికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పిస్తూ, ఆ సమర్పణలో స్వామిని దర్శిస్తూ, తన్మయమవుతూ ఉండేవాడు.  అందుకే ఆయనకీ ‘గుగ్గులు కలశ నాయనారు’ అని పేరొచ్చింది. 

గుగ్గులు కలశ నాయనారు తిరుక్కడైయ్యూర్ లోనే జన్మించారు. చిన్ననాటి నుండీ శివారాధనలు, ప్రత్యేకించి అమృతఘటేశ్వరుని ఆరాధన ఆయనకి  అలవడ్డాయి. ఎప్పుడూ చేతిలో ఒక చిన్న కుంపటి , నిప్పు పట్టుకొని, సంచీలో సాంబ్రాణి పెట్టుకొని, స్వామికి ధూపం వేస్తూ ఉండేవారు. అదే ఆయన తపస్సు.  అందులోనే  ఆయన ఆత్మ ఆ ఈశ్వరునిలో లయాన్ని పొందేది.  శరీరం గగుర్పొడిచి కనులవెంట బాష్పధారాలు వర్షించేవి.  ఆత్మానందాన్ని మించిన ఆనందానుభూతి ఇంకేముంటుంది. ఆవిధంగా ఆయన పూజలు కొనసాగేవి . 

నిరంతరమూ ఆ అమృతఘటేశ్వరుడు తప్ప మరో ధ్యాస, ధ్యానం లేవు గుగ్గులు కలశ నాయనారుకి. నిరంతర శివారాధనలు, శివభక్తులకు సేవలూ, గుగ్గిలం ధూపాలు ఇంతే నిత్యకృత్యాలు .  దాంతో ఆయన  ఆస్తి పాస్తులన్నీ, వేడికి కరిగే నెయ్యి లాగా కరిగిపోయాయి. చివరికి భార్య, పిల్లలకి పిడికెడు మెతుకులు పెట్టేందుకు కూడా రూపాయి కరువైపోయింది.  ఇటువంటి పరిస్థితుల్లో కూడా  గుగ్గులు కలశ నాయనారు తన ధూప సేవని మాత్రం మానలేదు . ఏదో విధంగా ఈశ్వరునికి తన ధూప సేవని కొనసాగించేవారు . 

ఇదిలా ఉండగా, ఒకనాడు పిల్లల ఆకలిని చూడలేక, గుగ్గులు కలశ నాయనారు భార్య తన మెడలో ఉన్న మంగళ సూత్రాలని తీసి , దానికి బదులుగా పసుపు కొమ్ముని కట్టుకొని , ఆ సూత్రాలని అమ్మి ఇన్ని నూకలు తీసుకు రమ్మని నాయనారు చేతికి ఇచ్చింది. నాయనారు వాటిని తీసుకొని అంగడికి బయలుదేరారు.  దారిలో  సాంబ్రాణి , గుగ్గిలం మూటలు పట్టుకొని అమ్మే అతను కనిపించాడు.  దూరానికి ఆ సాంబ్రాణి మంచి సువాసనలు వెదజల్లుతోంది .  ఆ క్షణం పిల్లల ఆకలిగానీ, తన చేతిలో ఉన్నది   భార్య మంగళ సూత్రమని గానీ , ఆయనకీ గుర్తుకు రాలేదు.  ఆ అమృతఘటేశ్వరునికి ఈ సాంబ్రాణితో ధూపం వేయాలి .  ఇదొక్కటే ఆయన చింతనగా మారింది . వెంటనే రెండు సంచుల సాంబ్రాణి, గుగ్గిలం తన దగ్గరున్న మాంగల్యం కుదవపెట్టి కొనేశాడు.  ఆ సంచులు పట్టుకొని సరాసరి  అమృతఘటేశ్వరుని ఆలయానికి వెళ్ళిపోయాడు. స్వామికి, అమ్మకి  సాంబ్రాణి ధూపం వేసి, ఆలయంలో ఒకమూలన ఉన్న స్తంభం దగ్గర  ఆ ఈశ్వరుణ్నే ధ్యానిస్తూ కూర్చున్నాడు. 

మరోవైపు, మాంగల్యం కుదువపెట్టి నూకలు తెస్తానని వెళ్లిన భర్త ఎంతకీ రాకపోయే సరికి ఇంటి ఇల్లాలు పిల్లలలకి సర్ది చెప్పి , వాళ్ళ కడుపులు నీళ్లతోనే నింపేసింది. ఆ బాధని కడుపులో ఓర్వలేక  కన్నీళ్లతో కరుణించమని పూజామందిరంలోని  ఈశ్వరుని ముందు కూలబడింది. గరిటెడు నీళ్లు , చిటికెడు విభూతికి పరవశించే భోళా శంకరుడు, తన కోసమే తపన పడే భక్తుని కుటుంబాన్ని గాలికి వదిలేస్తాడా ? వెంటనే, ఆ ఇల్లాలి ముందు నిలిచాడు.  “సాధ్వీ ! ఇక నుండీ నీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. విచారించకు.” అని ఆశీర్వదించారు .  అంతే ! ఆమె ఇల్లు సర్వ సంపదలతో, సకల సంబారాలతో , ధన,ధాన్య రాశులతో నిండిపోయింది.  ఆవిడ ,ఈశ్వరునికి అనేకానేక కృతఙ్ఞతలు తెలుపుకొని, వెంటనే వంట చేసి పిల్లలకి భోజనం పెట్టి, తానూ భర్త రాకకై ఎదురుచూస్తూ ఉండిపోయింది . 

 అక్కడ అమృతఘటేశ్వరుని ధ్యానంలో నిమగ్నమై పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని మరచి ఆత్మానందంలో మునిగి  ఉన్న గుగ్గులు కలశ నాయనారుకి స్వామి వాణి వినిపించింది. “భక్తా ! ఇక ఇంటికి వెళ్ళు.  నీవు ఆకలితో ఉన్నావు.  నీ భార్య నీ కోసం ఎదురు చూస్తోంది.” అని. వెంటనే గుగ్గులు కలశ నాయనారు తిరిగి ఆ అమృతఘటేశ్వరునికి  నమస్కారం చేసుకొని, ఇంటిబాట పట్టాడు. తన ఇల్లంతా సంపదలతో నిండి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. భార్యతో కలిసి భోజనం చేసి, జరిగినదంతా ఆమె ద్వారా తెలుసుకొని, అమితానందపరవశుడయ్యాడు.  

సాధారణంగా సంపదలు ఎక్కువయ్యే కొద్దీ , భగవంతునిపైన ధ్యాస, భక్తి తగ్గి అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది . కానీ అరిషడ్వార్గాలనీ జయించిన భక్తుడు గుగ్గులు కలశ నాయనారు . అందువల్ల కొత్తగా వచ్చి పడ్డ సంపదలు ఆయన దృష్టిని ఈశ్వరుడి నుండీ మరల్చలేకపోయాయి.  ఈశ్వరుడు తనకి ప్రసాదించిన ఈ సంపదలు శాశ్వతమైనవి కావని, శాశ్వతమైన తన భక్తిని, పూజానూ, ఈశ్వర సేవనూ  నిరాటంకంగా కొనసాగించేందుకు ఆ పరమేశ్వరుడు తనకి అనుగ్రహించిన ఒకానొక సౌకర్యం మాత్రమే అని, నాయనారు తలపోశాడు.  ఆ సంపద పరమేశ్వరునికి చెందినది. కనుక దానిని  ఈశ్వర సేవకి,  ఈశ్వర భక్తుల సేవలకూ వినియోగించాలని నిర్ణయించుకున్నాడు.  ఆ విధంగా ఈశ్వర సేవని చేస్తూ ,  చివరకు శివ సాయుజ్యాన్ని పొందాడు  గుగ్గులు కలశ నాయనారు. 

ఎవరైతే, ఈశ్వర భక్తే నిజమైన సంపదని తెలుసుకుంటారో , వారి అవసరావులు తీర్చేందుకు, వారికి సకల సౌకర్యాలూ కల్పించేందుకు ఆ ఈశ్వరుడే సదా సంసిద్ధుడై ఉంటాడు.  కాబట్టి ఐహికమైన, క్షణికమైన ఆనందాల కోసం వెంపర్లాడుతూ వాటికోసం ఈశ్వరార్చనలు చేసేకన్నా , తరగని సంపద, శాశ్వత ఆనంద పెన్నిధి అయినా ఆ ఈశ్వర సాన్నిధ్యాన్ని కోరడం , అందుకోసం తపించడం ఉత్తమమైన మార్గమని తెలుసుకోవాలి. అటువంటి మార్గం మొదట ఉత్సాహభరితంగా పూవులూ లతలతో ఆహ్వానిస్తున్నట్టు కనిపించకపోవచ్చు. కొన్ని పరీక్షలూ ఎదురుకావొచ్చు.  కానీ, ధర్మ మార్గాన్ని విడువకుండా పయనం సాగాలి.  అప్పుడు ఖచ్చితంగా అది విరబూసిన పూల పరిమళాలతో నిండి , శాశ్వాతానందమనే ఈశ్వర సన్నిధికి తప్పక తీసుకు వెళుతుంది.  ఆ  అభిరామీ సహిత అమృతఘటేశ్వరుని కృపాకటాక్షములు హితోక్తి పాఠకులకి ఎల్లవేళలా శుభములు చేకూర్చాలని స్వామిని ప్రార్ధిస్తూ ..  

శలవు .   

 

Nayanar, Stories, Guggulukalasa, Guggulu, Kalasa, Kalasha, 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi